మీడియా అడ్వైజరీ కమిటీని ప్రకటించాలి : మంత్రి శ్రీధర్ బాబు

మీడియా అడ్వైజరీ కమిటీని ప్రకటించాలి : మంత్రి శ్రీధర్ బాబు
  • మంత్రి శ్రీధర్ బాబుకు టీడబ్ల్యూ జే ఎఫ్ విజ్ఞప్తి

 హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూ జే ఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును బుధవారం అసెంబ్లీలోని ఆయన చాంబర్ లో ఫెడరేషన్ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. అసెంబ్లీ మీడియా పాసుల గడువు ముగిసి ఏడు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకూ కొత్త పాసులు ఇవ్వలేదని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు బట్టిపాటి రాజశేఖర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

పాత పాసుల కారణంగా అసెంబ్లీ ఎంట్రీ సమయంలో పోలీసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గడువు ముగిసిన పాస్ ల వినియోగం జర్నలిస్టులకు ఇబ్బందిగా ఉన్నదని ఫెడరేషన్ బృందం తెలిపింది. అసెంబ్లీ మీడియా అడ్వైజరీ  కమిటీ లేకపోవటం వల్ల మీడియా పాస్ ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పారు.

మీడియా సలహా కమిటీని వెంటనే ప్రకటించి కొత్త పాసులు జారీ చేయాలని టీ డబ్ల్యూ జే ఎఫ్ మంత్రికి విజ్ఞప్తి చేసింది. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రితో సమావేశమై వెంటనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్ యూ జే అధ్యక్షుడు బీ అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ప్రదీప్, వెంకన్న, పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.